సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 51 to 55 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 51 – 55

51. నాకు పెళ్లై పన్నెండేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు. సంవత్సరం క్రితం మావారికి వేరే మహిళతో సంబంధం ఉందని తెలిసింది. పెద్దవాళ్లతో చెబితే ఆయన్ను మందలించారు. కానీ నాకు తెలిసి ఇప్పటికీ ఆయన ఆమెను కలుస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య నాకు ఒంటిమీద దద్దుర్ల మాదిరి వస్తున్నాయి. చాలా దురదగా కూడా ఉంటోంది. జననాంగం వద్ద కూడా ర్యాషెస్ వచ్చి ఇబ్బంది అనిపిస్తోంది. మావారి అక్రమ సంబంధం వల్ల నాకేదైనా సుఖవ్యాధి వచ్చిందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి?

వివాహేతర సంబంధాల వల్ల సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువే. ఓసారి వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే… ఇన్ఫెక్షన్ వల్ల ర్యాషెస్ వచ్చాయా, వేరే ఏదైనా సమస్య వల్ల వచ్చాయా అనేది తెలుస్తుంది. కాబట్టి అవసరమైన రక్త పరీక్షలు వెంటనే చేయించుకుంటే, రిపోర్టును బట్టి చికిత్స చేస్తారు. మీవారికి కూడా పరీక్షలు చేయించి, ఆయనకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే చికిత్స చేయించవచ్చు. తర్వాత ఆయనతో మెల్లగా మాట్లాడి, ఆ సంబంధం నుంచి దూరం చేసే ప్రయత్నం చెయ్యండి. (డా.వేనాటి శోభ)

52. నా వయసు 29. పెళ్లై రెండేళ్లయ్యింది. సంవత్సరం క్రితం గర్భం వచ్చింది.కానీ ట్యూబులో వచ్చింది. అయితే అది పగిలి పోవడంతో ఆపరేషన్ చేసి ఎడమవైపు ట్యూబ్ తీసేశారు. కుడివైపు ట్యూబులో కూడా వాపులాగా ఉండటంతో మళ్లీ గర్భం వచ్చినా ట్యూబులోనే రావొచ్చు అంటున్నారు. అది నిజమేనా? నేను అందరిలాగా బిడ్డను కనలేనా? నేనేం చేయాలో చెప్పండి.

కుడివైపు ట్యూబులో కూడా వాపు ఉందంటున్నారు. అంటే ఈసారీ ట్యూబ్‌లో గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. కానీ అదృష్టంకొద్దీ గర్భాశయంలో వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల లేదా ట్యూబ్‌లో టీబీ వల్ల కూడా ఇలా వాపు వస్తుంది. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందని నిర్ధారణ అయితే…

దానికి సంబంధించిన మందులు వాడి, ఆపైన గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. సాధారణంగా అండం ఒక నెల కుడివైపు, ఒక నెల ఎడమవైపు తయారవుతుంది. కుడివైపు అండం విడుదలయినప్పుడు గర్భం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈసారి కూడా ట్యూబులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి…

పీరియడ్స్ తప్పిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్, ఫీరమ్ బీటాహెచ్‌సీజీ, ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే… గర్భం ట్యూబులో ఉందా గర్భాశయంలో ఉందా అన్నది త్వరగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్‌లో ఉంటే… అది చిన్నగా ఉన్నప్పుడే నిర్ధారించుకోవడం వల్ల ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో కరిగించేయవచ్చు. లేదంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్యూబ్స్‌తో సంబంధం లేకుండా గర్భం దాల్చడానికి ప్రయత్నం చేయవచ్చు. (డా.వేనాటి శోభ)

53. నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. పిల్లల మధ్య ఎడం కోసమని నేను డాక్టర్ సలహా మేరకు రెండేళ్లుగా హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నాను. అయితే అప్పట్నుంచీ పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. డాక్టర్‌ని సంప్రదిస్తే హార్మోన్ ఇంజెక్షన్లు వాడే చాలామందికి అలా అవుతుందని చెప్పారు. ఇక రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేద్దామని ఆరు నెలల క్రితం ఇంజెక్షన్లు ఆపేశాను. అయినా పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్‌ని కలిస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత నెలసరి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రావడం లేదు. నాకు మరో బిడ్డ కావాలంటే ఏం చేయాలి?

గర్భం త్వరగా రాకుండా ఉండటానికి depo provera అనే ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మూడు నెలలకు ఒకటి చొప్పున మూడు నాలుగు కంటే ఎక్కువసార్లు తీసుకోకూడదు. అంతకుమించి తీసుకోవడం వల్ల ఒక్కోసారి గర్భాశయ లోపలి పొర బాగా పల్చబడిపోయి, చాలా నెలలు లేదా సంవత్సరాలు పీరియడ్స్ రాకుండా పోతాయి. లేదంటే కొందరిలో ఎక్కువసార్లు వచ్చేయడం, ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేదంటే బ్లీడింగ్ మధ్యమధ్యలో కనబడటం వంటివి కూడా జరుగుతాయి.

మీరు ఇప్పటికే రెండేళ్లు వాడేశారు కాబట్టి వాటిని ఆపి ఆరు నెలలు అయినా కూడా మీ శరీరంలో ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. అది పూర్తిగా పోయేవరకు ఆగాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని రోజుల పాటు ఈస్ట్రోజన్ హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. అలా అని కంగారు పడాల్సినదేమీ లేదు. మీరు మెల్లగా ప్లాన్ చేసుకుని, తప్పకుండా మరో బిడ్డను కనవచ్చు. (డా.వేనాటి శోభ)

54. నా వయసు 23. నాకిప్పుడు నాలుగో నెల. వారం రోజుల క్రితం సడెన్‌గా బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. స్కాన్ చేసి, గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఉందని, కాస్త పెద్దగా ఉండటంతో సమస్యలు రావొచ్చని చెప్పారు. నాకు చాలా భయమేస్తోంది. ఇప్పుడు నేనెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నా బిడ్డకు మంచిది?

ఫైబ్రాయిడ్ పెద్దగా ఉంది అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉందో రాయలేదు. గర్భాశయం లోపలి పొరలో ఉందా లేక బయటి పొరలో ఉందా అనేది కూడా రాయలేదు. ఎందుకంటే, బయటి పొరలో ఉండే ఫైబ్రాయిడ్ పెద్దగా ఉన్నా… బయటి పొరలో ఉంటుంది కాబట్టి గర్భానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే లోపలి పొరలో ఉంటే కనుక… అది ఉన్న పొజిషన్‌ను బట్టి, మామూలు పరిమాణంలో ఉన్నా కూడా సమస్యలు రావొచ్చు.

కొన్ని ఫైబ్రాయిడ్ల వల్ల కొంతమందికి అబార్షన్లు కూడా అవ్వవచ్చు. కొందరికి నెలలు నిండకుండానే కాన్పు కావొచ్చు. మరికొందరిలో సాధారణ కాన్పుకి అడ్డంకి కావొచ్చు. ఒక్కోసారి కాన్పు సమయంలో, ఆ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశాలూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు మాటిమాటికీ కడుపునొప్పి రావొచ్చు. గర్భంతో పాటు ఫైబ్రాయిడ్ పరిమాణం కూడా పెరగవచ్చు. లేదంటే అలానే ఉండొచ్చు. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి తరచుగా చెకప్ చేయించుకోండి. అవసరమైతే గర్భాశయం ఇరిటబుల్ అయ్యి, కాంట్రాక్షన్‌‌స రాకుండా ప్రొజెస్ట రాన్ మాత్రలు, ఇంజెక్షన్లు తొమ్మిదో నెల వచ్చేవరకూ తీసుకోవాల్సి ఉంటుంది. (డా.వేనాటి శోభ)

55. నా వయసు 34. పెళ్లై ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరం బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. అయితే మావారు ఒకసారి కలిసిన తర్వాత కాసేపటికే రెడీ అయిపోతారు. కానీ నాకు అంత త్వరగా మూడ్ రాదు. చాలా టైమ్ పడుతుంది. ఆయనేమో మరోసారి చేద్దాం అంటారు. నేను సహకరించలేను. ఆయనకు వచ్చినంత త్వరగా నాకెందుకు మూడ్ రావడం లేదు?

ఆడవాళ్లకి వయసు పెరిగేకొద్దీ ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల బాగోగులు చూసుకోవడంతోనే సమయం సరిపోతూ ఉంటుంది. దానివల్ల అలసట కలుగుతుంది. మగవారిలో ఉన్నంత హుషారు ఉండదు. కాబట్టి మాటిమాటికీ శృంగారంలో పాల్గొనలేరు. మగవారిలో కోరికలు ప్రేరేపించే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఆడవారిలో ఈ హార్మోన్ కొద్ది మోతాదులోనే ఉంటుంది. దానివల్ల కూడా మగవారికి మూడ్ త్వరత్వరగా వస్తుంది. ఆడవారికి కాస్త ఆలస్యం కావొచ్చు. కాబట్టి మీరు ఇంత చిన్న విషయానికి దిగులు పడకండి. మీ అలసట గురించి ఆయనకు చెప్పండి. అర్థం చేసుకుని సహకరిస్తారు. (డా.వేనాటి శోభ)

Telugu Sexology – Doubts and Advice 56 – 60

Read Telugu Sexology – Counselling 1 – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *