సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 46 to 50 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 46 – 50

46. నా వయసు 22 ఏళ్లు. హైదరాబాద్‌లో రూమ్ తీసుకొని ఉంటూ, ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నాను. నా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంది. నేను ఈమధ్య రోజూ పోర్నోగ్రఫీ (నెట్‌లో అశ్లీల చిత్రాలు) చూడటానికి అలవాటు పడ్డాను. రేపట్నుంచి చూడకూడదు అనుకుంటాను. కానీ మర్నాటికి రెడీ అయిపోతున్నాను. ఒక్కో రోజు ఆరేడు గంటలపాటు చూస్తున్నాను. ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?

సాధారణంగా మీ వయసు వారిలో పోర్నోగ్రఫీపై కొంత ఆసక్తి ఉంటుంది. వారంలో ఎప్పుడో ఒకసారి ఒకటి రెండుసార్లు అవకాశం దొరికినప్పుడు పోర్నోగ్రఫీ చూడటం, చదవడం వేరు. దానికోసమే వెంపర్లాడటం వేరు. ఇది కాస్త మోతాదు మించిన ప్రవర్తనే. మీరు ఉద్యోగప్రయత్నాలలో ఉన్నానని చెబుతున్నారు కాబట్టి ముందుగా ఆ పనిని సాధించడం కోసం బయటకు వెళ్తూ ఉండండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ మీ కాళ్ల మీద మీరు నిలబడటం అవసరం. స్వతంత్ర జీవనం కోసం, మంచి జీవితం కోసం అది తప్పనిసరి. ఆ విషయాన్ని గుర్తెరిగి, మీరు హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్యాన్ని ముందుగా అధిగమించండి. మీకు ఉద్యోగం గానీ, ఉపాధిగానీ దొరికి ఏదైనా వ్యాపకం తప్పనిసరి అయినప్పుడు మీ పోర్నోగ్రఫీ అలవాటు దానంతట అదే తగ్గుతుంది. కానీ రోజుకు ఆరేడు గంటలు పోర్నో చూడటం అనేది మీ సమయాన్ని వృథా చేయడమే గాక… మీకు కొన్ని మానసిక, శారీరక సమస్యలనూ తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను గానీ, సైకియాట్రిస్ట్‌ను గానీ కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. (డాక్టర్ వి. చంద్రమోహన్)

47. నా వయసు 28 ఏళ్లు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పటికే పెళ్లయిన స్నేహితులు కొందరు మా మొదటిరాత్రి అన్నిసార్లు, ఇన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నాను అని గొప్పగా చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం అస్సలు పాల్గొనలేకపోయామని అంటున్నారు. ఇందులో నేను దేన్ని నమ్మాలి. మొదటిరాత్రికోసం శారీరకంగా, మానసికంగా ఎలా సంసిద్ధం కావాలి?

మీ స్నేహితులు చెప్పిన మాటలను విని ఊరుకోండి. వాటిని సీరియస్‌గా పట్టించుకోవద్దు. ఎందుకంటే పెళ్లయిన కొత్తలో ఉత్సాహంగా ఉండి, పార్ట్‌నర్‌కూ, మీకూ బెరుకు లేకుండా ఉండి, పార్ట్‌నర్ సహకారం కూడా బాగా ఉంటే మొదటిరాత్రి నాలుగైదు సార్లు సెక్స్‌లో పాల్గొనడం సాధారణమే. అలా కాకుండా ఇద్దరిలోనూ ఉత్సాహం ఉన్నప్పటికీ మానసికంగా ఉండే బెరుకు పోవడానికి కొంతమందిలో కొద్దిసేపే సమయం తీసుకుంటే, మరికొందరిలో ఒకటి రెండు రోజులు కూడా పట్టవచ్చు. దీనికి తోడు పురుషుల్లో పురుషాంగం పూర్వచర్మం  వెనక్కు రాకపోవడం (ఫైమోసిస్), మీ పార్ట్‌నర్‌కు వెజినిస్‌మస్ (యోని బిగుతు) వంటి సమస్య రావడం జరిగితే కలయిక కష్టం కావచ్చు. అప్పుడు కొంత కౌన్సెలింగ్‌తో ఈ సమస్యను సులభంగా దాటవచ్చు. అపోహలనూ, అభూతకల్పనలనూ నమ్మకండి. మీ సొంత అనుభవమే అన్నిటికంటే మంచి అనుభవం. దాన్ని చిరస్మరణీయం చేసుకోవడం కోసం మీ ఇద్దరూ పరస్పరమైన అనురక్తితో మెలగండి. (డాక్టర్ వి. చంద్రమోహన్)

48. నా వయసు 50 ఏళ్లు. నా భార్య వయసు 45 ఏళ్లు. తాను డయాబెటిస్‌తో బాధపడుతోంది. రోజులో మూడుసార్లు ఇన్సులిన్ తీసుకుంటోంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మేమిద్దరం ఉత్సాహంగా కలవాలంటే తన పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చెప్పండి. తనను ఉత్సాహపరచడానికి ఏం చేయాలో సూచించండి.

ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ మీ పార్ట్‌నర్ ఆరోగ్యంగా ఉండి, సెక్స్‌లో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతుంటే మీరు నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఇక డయాబెటిస్ ఉన్నవారిలో నాన్‌బ్యాక్టీరియల్ వెజినైటిస్, సిస్టైటిస్ వంటి అంశాల వల్ల సెక్స్ కోరికలు తగ్గుతాయి. యోని పొడిబారిపోవడం, డయాబెటిస్ కారణంగా తగ్గని గాయం ఏదైనా యోనిలోపల ఉంటే, మీరు ఇచ్చే స్ట్రోక్స్ వల్ల ఒక్కోసారి అది మరింత రేగి, అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర నియంత్రణలో ఉంచుకొని, యోని ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండా ఉంటే మీరిద్దరూ నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనండి. ఆమెను ఉత్సాహపరిచేందుకు మీరు ఎక్కువగా ఫోర్‌ప్లే చేయండి. మీరిద్దరూ ఇలా సెక్స్‌లో పాల్గొంటూ ఉండటం కూడా మానసికంగా ఇద్దరమూ చాలా ఆరోగ్యంగా ఉన్నాం, బాగున్నాం అనే ఫీలింగ్‌తో పాటు, జీవనోత్సాహం కలుగుతుంది. ఇది మీ ఫిట్‌నెస్‌తో పాటు భవిష్యత్తులో వచ్చే కాంప్లికేషన్లనూ తగ్గిస్తుంది. (డాక్టర్ వి. చంద్రమోహన్)

49. నా వయసు 35 ఏళ్లు. నా భార్య, నేనూ సంతోషంగా జీవితం గడుపుతున్నాం. ఈమధ్య శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషాంగం మధ్యలోనే మెత్తబడుతోంది. మళ్లీ ఉత్సాహం తెచ్చుకొని ప్రయత్నిస్తే తప్ప పూర్తికావడం లేదు. ఇంతకుముందు ఈ సమస్య లేదు. దీనికి ఏమైనా ఒత్తిడి, ఆందోళన కారణమా? తగిన సలహా ఇవ్వండి.

ఈమధ్య నాలుగు పదుల వయసు నాటికే కొన్ని ఫిట్‌నెస్ సమస్యలు వస్తున్నాయి. అయితే మూడు పదుల నుంచి నాలుగు పదుల వయసు వచ్చినప్పటి నుంచీ శరీరంలో కొన్ని మార్పులు రావడం మొదలవుతుంది. మీకు ముప్పయి ఐదేళ్ల వయసు అంటున్నారు కాబట్టి మీ ఒంట్లో ఒకసారి చక్కెరపాళ్లు, రక్తపోటు, కొవ్వుల పాళ్లు, రక్తంలో క్రియాటినిన్ పాళ్లు తెలుసుకునేందుకు సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోండి. వైద్యపరమైన సమస్యలేమీ లేకపోతే… సాధారణంగా కెరీర్ పరంగా సెటిల్ అయ్యే వయసుకు ముందు దశలో మీరు ఉన్నారు. కాబట్టి ఈ వయసులో మీపై సామాజిక పరమైన ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. మీ వయసులో పురుషాంగానికి రక్తప్రసరణ తగ్గడం (ఆర్టీరియల్ ఇన్‌సఫిషియెన్సీ) రావడం కొంత అరుదు. మానసిక సమస్యే ప్రధానం. మీరు కొంత వ్యాయామం చేస్తూ ఉంటే ఫిట్‌నెస్‌ను సాధించగలరు. (డాక్టర్ వి. చంద్రమోహన్)

50. సున్తీ చేయించుకోవడం మంచిది అని చాలా సార్లు వింటున్నాను. నాకు పెళ్లయింది. పిల్లల కూడా ఉన్నారు. ఏ వయసులోనైనా చేయించుకోవచ్చా? సున్తీ వల్ల లైంగికపరమైన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా?

సాధారణంగా నలభై ఏళ్ల వయసు దాటాక కొందరిలో డయాబెటిస్ వంటి జబ్బు రావడం సంభవిస్తుంటుంది. ఇలా రక్తలో చక్కెరపాళ్లు అనియంత్రితంగా ఉన్నప్పుడు మాటిమాటికీ చక్కెరతో నిండి ఉన్న మూత్రంతో పురుషాంగం పూర్వచర్మం తడుస్తూ ఉండటం వల్ల ఆ పూర్వచర్మంలో పగుళ్లు రావచ్చు. ఇక ఒక్కోసారి పూర్వచర్మం బిగుసుకుపోయే ఫైమోసిస్ వంటి కండిషన్ ఏర్పడవచ్చు. ఒక్కోసారి పురుషాంగం పూర్వచర్మం వెనక్కువెళ్లి బిగుసుకుపోయి, ముందుకు రాకపోతే దాన్ని పారాఫైమోసిస్ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ. కొందరికి అక్కడి చర్మానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్ని బెలనాఫ్లయిటిస్ అంటారు. ఇలాంటి అన్ని సమయాల్లో సెక్స్ కలయిక చాలా బాధాకరంగా పరిణమిస్తుంది. అందుకే అలాంటివారికి సున్తీ సూచిస్తుంటాం. పురుషాంగం పూర్వచర్మం లేకపోవడం వల్ల మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గి, సెక్స్‌లో పాల్గొనడం సులువవుతుంది. అయితే మీకు సమస్య ఏమీ లేనప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. (డాక్టర్ వి. చంద్రమోహన్)

Telugu Sexology – Doubts and Advice 51 – 55

Read Telugu Sexology – Counselling 1 – 5

2 Responses to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 46 to 50 | Telugu Sexology”
  1. amar July 17, 2016
  2. Bujji August 16, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *